హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో పోలీస్ కొలువు సాధించాలనే నిరుద్యోగుల కలలను వయోపరిమితి పెంచకుండా రాష్ట్ర ప్రభుత్వం చిన్నాభిన్నం చేస్తోందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఎజ్ లిమిట్ 36 ఏండ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో అభ్యర్థులతో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. అధికారంలోకి రాకముందు జీవో 46ను రద్దు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్, ఇప్పుడు పట్టించుకోకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటోందని మండిపడ్డారు.
ఒకే పరీక్ష రాసిన అభ్యర్థులకు వేర్వేరు కటాఫ్‌లు ఉండటం ఏంటని ప్రశ్నించారు. హైదరాబాద్ కమిషనరేట్లకు ఎక్కువ పోస్టులు కేటాయించడంతో గ్రామీణ జిల్లాల అభ్యర్థులకు 120, -130 మార్కులు వచ్చినా ఉద్యోగాలు రాలేదని ఆరోపించారు. నారాయణపేట, గద్వాల, ఆదిలాబాద్, నిర్మల్ వంటి వెనుకబడిన జిల్లాల యువత కష్టపడి చదివినా అవకాశాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర అవసరాలకు 5 వేల కానిస్టేబుల్ పోస్టులు సరిపోవని, 20 వేల పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
